రెపో రేటు తగ్గింపు

05-oct-04

ఆర్‌బీఐ నిర్ణయం

ముంబై,అక్టోబర్‌ 3(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చాలారోజుల తర్వాత రెపో రేట్లను తగ్గించింది. ఆరేళ్ల  కనిష్టస్థాయికి వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో భాగంగా ఆర్బీఐ మంగళవారం నాడిక్కడ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. 25 బేస్‌ పాయింట్లు (0.25 శాతం)

తగ్గించడంతో రెపో రేటు ఆరేళ్ల (6.25 శాతం) కనిష్ఠానికి చేరింది. రెపో రేటు తగ్గడంతో ఆ మేరకు బ్యాంకులు కూడా కస్టమర్లకు వడ్డీరేట్లను తగ్గించనున్నాయి. దీంతో ¬మ్‌, వెహికిల్‌ లోన్స్‌ ఈఎమ్‌ఐలు తగ్గుతాయి. రివర్స్‌ రెపో రేటు 5.75 శాతంగా ఉంచారు. రెపో రేటు తగ్గింపు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ వంద పాయింట్లు లాభంలోకి దూసుకెళ్లింది. ఆర్బీఐలో ఈ రేటు తగ్గింపు కొత్త యుగానికి నాంది పలికింది. తొలిసారి ఆరుగురు సభ్యులు గల మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఆర్బీఐ గవర్నరే రేట్ల విషయంలో తుది నిర్ణయం తీసుకునేవారు. ఉర్జిత్‌ పటేల్‌ గవర్నర్‌గా నియమితులైన తర్వాత జరిగిన తొలి ద్రవ్యపరపతి సవిూక్ష కూడా ఇదే కావడం విశేషం. ఈ మానిటరీ పాలసీ ప్యానెల్‌లో ఉర్జిత్‌ పటేల్‌తోపాటు ఇద్దరు ఆర్బీఐ అధికారులు, ప్రభుత్వం నామినేట్‌ చేసిన ముగ్గురు అధికారులు ఉంటారు. వడ్డీ రేట్ల తగ్గింపు మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ద్రవ్యపరపతి సవిూక్షకు ముందు ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. కొత్త గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ కమిటీ కొత్త ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ గవర్నర్‌ మాత్రమే వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకునేవారు. కానీ తొలిసారి ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి కమిటీ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొంది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే అప్పుపై వడ్డీ రేట్లు తగ్గడంతో వినియోగదారులకు బ్యాంకులు ఊరట ఇచ్చే అవకాశం ఉంది. గృహ, వాహన లోన్‌లపై వడ్డీని తగ్గించే ఛాన్స్‌ ఉంది. వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చాలా కాలం నుంచి కంపెనీలు, వ్యాపార వేత్తలు కోరుతున్నారు.

సానుకూలంగా మార్కెట్లు

ఆర్‌బీఐ నిర్ణయంతో స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 91 పాయింట్లకు పైగా, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిప్టీ 31 పాయింట్లలకు పైగా లాభాన్ని పొందాయి. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాలని ఇప్పటికే పలువురు మంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల కూడా ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌బీఐ నిర్ణయంపై కేంద్ర విద్యుత్తు శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వడ్డీరేట్ల కోత ఇప్పటికి సాధ్యమైందని ఆయన ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే మోదీ లక్ష్యానికి అనుకూలంగానే ఈ పాలసీ ఉందని ఆయన పేర్కొన్నారు.అందర్ని ఆశ్చర్యపరుస్తూ ప్రముఖ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఉర్జిత్‌ పటేల్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని.. ఇది ఏవిధంగా పనిచేస్తుందో చూద్దామని ఆయన పేర్కొన్నారు.