రేపు నల్లగొండలో ఉమ్మడి జిల్లాల సభ

ఏర్పాట్లలో నిమగ్నమయిన గులాబీ నేతలు

జనసవిూకరణపై మంత్రి జగదీశ్వరెడ్డి దృష్టి

భారీగా జనాలను తరలించేందుకు సన్నాహాలు

నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ తరవాత టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మలి సభను నల్లగొండలో నిర్వహించబోతున్నారు. 4న గురువారం పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో గులాబీ నేతలు సభకోసం కసరత్తు చేస్తున్నారు. ఈ సభ ద్వారా

ఉమ్మడి నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఉమ్మడి జిల్లాకు కలిపి అక్టోబర్‌ 4వ తేదీన నల్లగొండలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా నాయకత్వం గత వారం రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యింది. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంలో సీనియర్లు, ముఖ్యులు జిల్లానుంచే ప్రాతినిధ్య వహిస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని సిఎం కెసిఆర్‌ తన ప్రసంగం ద్వారా వారిని దుయబ్టటే అవకాశాలు ఉన్నాయి.

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారీ బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నల్లగొండతోపాటు కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాలలో ఓటమి పాలైంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాపై తిరుగులేని పట్టును నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌కు జిల్లానుంచే గండి కొట్టాలన్న వ్యూహంలో భాగంగానే కేసీఅర్‌ రాష్ట్రంలో పాల్గొంటున్న మూడో సభ కోసం నల్లగొండను ఎంపిక చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకతకూ చెక్‌ పెట్టాలని నాయకత్వం భావిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంపై పట్టు బిగించేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని నేతలు నడుం బిగించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఈసారి కంచర్ల భూపాల్‌రెడ్డిని బరిలోకి దింపుతోంది. దీంతో ఆయన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు భారీగా జనాన్ని తరలించేలా సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసి పక్కాగా ఏర్పాట్లు చేపడతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి పల్లె నుంచీ సుమారు 3లక్షలకు పైగా సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడతాం అని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.