రేవంత్ బాటలో అందరూ కలసి రావాలి: గండ్ర
వరంగల్,నవంబర్1(జనంసాక్షి): కేసీఆర్, ఆయన కుటుంబం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అందరూ చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అందుకు కాంగ్రెస్ పార్టీలో చేరి పోరాడాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం పాలన సాగిస్తున్నారు కాబట్టే తెలంగాణలో కుటుంబపాలన అన్నాం అన్నారు. రేవంత్ చేరికతో టిఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని నఅ/-నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి, మంత్రి పదవులు వదులుకుని సీనియర్లకు గౌరవం ఇచ్చారని, దీన్ని కుటుంబపాలన అనడానికి వీల్లేదన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరికి స్వేఛ్చ ఉందన్నారు. ఏ ఫలాలు ఆశించి తెలంగాణలో ఉద్యమాలు చేశారో అవి ప్రజలకు అందడం లేదని, సోనియా అమరుల ఆకాంక్షల కోసం తెలంగాణ ఇస్తే అది కెసిఆర్ అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఫలాలు ప్రజలకు అందకుండా కెసిఆర్ కుటుంబం అనుభవిస్తున్నదని, దానిని సహంచలేకే పోరాడాలని రేవంత్ నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ బలపడటాన్ని జీర్ణించుకోలేని వారు చేసే విమర్శలను తాము పట్టించుకోబోమని అన్నారు. రేవంత్ పార్టీ మారిన పరిణామంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న గుబులు రెట్టింపు అయ్యిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని గండ్ర అన్నారు.