రేవంత్ వ్యాఖ్య నిజమా, ఏం జరిగింది: హరీష్‌కు చెక్, వారసుడు కెటిఆర్?
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో అధికార, విపక్ష నాయకుల మధ్య వాడిగా వేడిగా వాగ్యుద్ధం కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను అధికార పార్టీ నుంచి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నెత్తికెత్తుకున్నారు. అయితే, మంత్రి హరీష్ రావు ఎక్కడా కనిపించక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో, నిన్నటి వరకు విపక్షాల నోళ్లను మూయించేందుకు ఎదురు దాడికి దిగిన వారిలో హరీష్ రావు ముందుంటారు. కానీ గ్రేటర్ హడావుడి మొదలైనప్పటి నుంచి ఆయన ఊసు ఎక్కువగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులు, నిధులు అంటూ ఆయన ఢిల్లీ, ముంబై తిరుగుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుంటే హరీష్ రావు గ్రేటర్ ఎన్నికల సమయంలో అంతగా కనిపించకపోవడాన్ని విపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. రెండు రోజుల క్రితం టిడిపి నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్, కెటిఆర్ ఆటలో హరీష్ రావు అరటి పండు అని, అరటి పండు తొక్క తీసినట్లు ఆయనను తీసేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హరీష్ రావు ఎక్కడా కనిపించక పోవడంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అన్న చర్చ సాగుతోంది. గ్రేటర్ ఎన్నికలలో హరీష్ రావు హడావుడి ఏమాత్రం కనిపించక పోవడంతో.. ఇక భావి తెరాస నేత కెటిఆరేనా? హరీష్ రావు మెదక్‌కే పరిమితమా అనే చర్చ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికల బాధ్యత నుంచి తప్పించడంపై హరీష్ రావు అంసతృప్తితో ఉన్నారని కూడా అంటున్నారు. కెసిఆర్ నిర్ణయమే శిరోధార్యం అని ఆయన చెబుతున్నారట. అసలు ఏం జరిగింది!? గ్రేటర్ ఎన్నికలలో హరీష్ రావు కనిపించక పోవడం పైన ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఇటీవల పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… హరీష్ రావు నారాయణఖేడ్ ఉప ఎన్నిక వ్యవహారాలు చూసుకుంటారని, గ్రేటర్లో కెటిఆర్, జగదీశ్వర్ రెడ్డిలు చూస్తారని చెప్పారట. అప్పుడే హరీష్‌ను తప్పించినట్లుగా చాలామంది భావించారట. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పుడు హరీష్ రావుకు బదులు మంత్రి కెటిఆర్ వద్దకు వెళ్తున్నారంటున్నారు. తెలియక.. ఎవరైనా తన వద్దకు వస్తే తనను అడగవద్దని హరీష్ రావు చెబుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నిక ద్వారా కెసిఆర్ తన వారసుడిని కెటిఆర్‌గా దాదాపు నిర్ణయించినట్లేనని పలువురు నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.