రైతన్నా…నేనున్నా

 రుణమాఫీపై ఎలాంటి అయోమయానికి తావులేదు
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం
ట్విట్టర్‌ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన కన్నడ సీఎం కుమారస్వామి
బెంగళూరు, జూన్‌15(జ‌నం సాక్షి ) : రైతు రుణాల మాఫీపై ఎలాంటి అయోమయానికి తావు లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇందుకు సంబధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్‌లో రైతులకు భరోసా ఇచ్చారు. రైతు మిత్రులారా… రుణాల మాఫీపై ఎలాంటి గందరగోళానికి తావులేదు. రుణ మాఫీకి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. రుణ మాఫీ శాస్త్రీయంగా…గరిష్ట స్థాయిలో రైతులకు మేలు చేసేలా ఉండాలన్నదే నా అభిమతం. అందుకు అనుగుణంగానే విధివిధానాలను రూపొందిస్తున్నామని కుమారస్వామి తెలిపారు. త్వరలో ఆ వివరాలను ప్రకటిస్తాంమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవల కుమారస్వామి రైతు సంఘాల ప్రతినిధులతో బెంగళూరులో సమావేశమై వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైతు రుణాల మాఫీ అంశం జేడీయూ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాన అంశంగా ఉంది. అందుకు తగ్గట్టే సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం కూడా కుమరస్వామి ‘మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అంటూ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.