రైతాంగానికి మంచిరోజులు: ఎమ్మెల్యే
మెదక్,జూన్4(జనం సాక్షి):కొత్త సంవత్సరం రైతాంగానికి మరిచిపోలేని అనుభూతిని మిగల్చనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్ అందడం అన్నది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో విద్యుత్ కష్టాలు తొలగనున్నాయి. ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన కూడా పూర్తి కావడంతో కొత్త పాస్‌పుస్తకాలు అందుతున్నాయి. ఇక నుంచి భూ వివాదాలు ఉండవని చెప్పవచ్చన్నారు. అంతేగాకుండా ముందస్తు పెట్టుబడిగా ఏడాదికి రూ. 8వేలు అందజేసే పక్రి య కూడా మొదలుకావడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. .సీఎం కేసీఆర్ పేదబడుగుబలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే కాంగ్రెస్ నేతలు విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 70 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తోంది. మత్స్యకార్మికులకు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు అందజేసింది. ఈ ఏడాదిలో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మిగిలిన కులవృత్తులను సైతం ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇవన్నీ వారికి కంటగింపుగా మారాయని అన్నారు.