రైతుబందులో నాలుగోస్థానంలో మెదక్‌

జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు 
మెదక్‌,మే29(జ‌నం సాక్షి):రైతుబంధు పథకం రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లా నాలుగో స్థానంలో ఉందని జిల్లారైతు  సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు అన్నారు.  జిల్లాలో రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు 80 శాతం పూర్తి చేశామని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, దేశ చరిత్రలోనే రైతుబంధు పథకం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్‌కు ప్రతి రైతు రుణపడి ఉండాలన్నారు. జూన్‌ తర్వాత రైతు వేదికలకు స్థలాలను గుర్తించాలని తెలిపారు. 5వేల ఎకరాలకు ఒక రైతు వేదిక ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు కోసం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మిగిలిన రైతుబంధు చెక్కులను వారంరోజుల్లో రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.  వానకాలం పంటపెట్టుబడుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులు ఇప్పటివరకు తీసుకోని రైతులకు త్వరలోనే పంపిణీ చేస్తారని తెలిపారు. రైతుబంధు చెక్కుల వల్ల వానకాలం పంట విస్తీర్ణం, పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో జరిగిన తప్పులను త్వరలోనే సరిచేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వారంలోగా చెక్కులు పంపిణీ పూర్తి చేస్తే రైతులకు పంట పెట్టుబడులకు పనికి వస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులకు పంట సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న చెక్కుల పంపిణీ పక్రియ గ్రామాల్లో కొనసాగుతుంది. ఆయా తేదీల్లో కేటాయించిన గ్రామాల్లో ఎవరైనా రైతులు చెక్కులు, పాస్‌పుస్తకాలను తీసుకోని వారికి గ్రామాల్లోనే అందించేందుకు  చర్యలు తీసుకున్నారు. చెక్కులను డ్రా చేసుకునేందుకు రైతులకు సులువుగా ఉండేలా బ్యాంక్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామానికి ఒక్కరోజు చొప్పున చెక్కులను డ్రా చేసుకునేందుకు నిర్ణయించారు. దీంతో బ్యాంక్‌ అధికారులు నిర్ణయించిన తేదీల్లో ఆయా గ్రామాలకు చెందిన రైతులు చెక్కులను డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్దకు వస్తున్నారు.