రైతుబంధుతో మారిన తెలంగాణ సీన్
పథకాల అమలుతో సానుకూలంగా వాతావరణం
పాత టీమ్ ఎంపిక వెనక బలమైన కారణం కూడా ఇదే
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): అనుకున్నట్లుగానే తెలంగాణలో ముందస్తు ఎన్‌ఇనకలు వచ్చాయి. ఇసి కసరత్తు మొదలయ్యింది. దీంతో బహుశా నవంబర్‌లో ఎన్నికలకు అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడున్న స్థితిలో తెలంగాణలో వాతావరణం తమకు అనుకూలంగా ఉందన్న భావనలో అధికార టిఆర్‌ఎస్ ఉంది. ప్రజావ్యతిరేకత తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఆయన దూరాభారం ఆలోచించి ఈ పథకం అమలు చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయంగానే ఉంది. ఇప్పటి వరకు ప్రకటించి అమలు చేసిన అనేక పథకాలు మళ్లీ ఆయనకు అధికరాం కట్టబెడతాయన్న భావనలో ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అంగన్‌వాడీల జీతాల పెంపు తదిరత అంశాలు సానుకూలంగా ఉన్నాయి. అధికారంలోకి వస్తే మరిన్ని తాయిలాలు ఇస్తామని హుస్తాబాద్ సభలో కెసిఆర్ ప్రకటించారు. కేవలం ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పదిలపర్చుకునే దిశగా ఈ పథకాలు బాగా ఉపయోగపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్‌కు ఉన్న వ్యతిరేకత కూడా మటుమాయం అయ్యింది. ఎందుకంటే రైతులంతా ఇప్పుడు కెసిఆర్‌కు జై అంటున్నారు. విపక్షాలకు అవకాశం లేకుండా పథకాలతో కెసిఆర్ గట్టి దెబ్బనే కొట్టారు. దీంతో అన్ని పార్టీలు కలసినా ఇప్పుడు కెసిఆర్‌ను ఢీకొనడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా ఉన్నారని తెలంగాణలో అమలవుతున్న పథకాలతో దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. ఇదొక్కటే చాలు కెసిఆర్ ఈ ఎన్నికలపై ధీమాగా ఉన్నారనడానికి. తెలంగాణలో కెసిఆర్ మరింతగా బలోపేతం కావడం రాజకీయంగా కలసివచ్చే అంశంగా చూడాలి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా తన స్థానాన్ని పదిల పర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడటమే కాకుండా ప్రతిపక్షాలను బలహీనపరిచారు. ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమన్నారు. ఇది పార్టీల కలయికో లేదా విలీనంగానో చూడరాదన్నారు. ఇదంతా తెలంగాణ అభివృద్దిలో బాగమని విశ్లేషించారు. ఆ తర్వాత వివిధ పథకాలకు రూపకల్పన చేయడం ద్వారా ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే రైతుబంధు పథకం ప్రకటించడంతో పాటు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రైతులతో పాటు ప్రజల్లో
కూడా భరోసా పెరిగింది. అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలు అందరికీ అందకపోవడం వల్ల ప్రజలలో అసంతృప్తి ఉందన్నది అధికారపార్టీ నాయకుల అంచనా! తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2లక్షల రుణమాఫీ అంటున్నా ప్రజలు ముఖ్యంగా రైతులు నమ్మడానికి లేకుండా పోయింది. తన పట్ల ప్రజలలో వ్యతిరేక భావన లేనప్పటికీ పలువురు శాసనసభ్యులపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న విషయం కూడా కెసిఆర్‌కు బాగా తెలుసు. అయినా పాతటీమ్‌తోనే ఆయన ఎన్నికలకు వెళ్లడానికి సాహసం చేస్తున్నారు. ప్రజలు తనపై నమ్మకంతో ఉన్నారని, స్థానిక నేతలతో కాదన్న భావనలో కెసిఆర్ ఉన్నారు. అందుకే వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థులను దింపలేదు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను మార్చకపోతే ఓటమి ఖాయమని భావించినా సాహసోపేతంగా పాత అభ్యర్తులకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకు గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పని లేకుండా చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలలో అనుకూలత ఉన్నప్పటికీ కనీసం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే దాని ప్రభావం గెలుపుపై పడుతుందని గతంలో అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయిందనీ, పార్టీ నాయకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకుని కొత్తటీమ్‌తో కెసిఆర్ ఎన్నికలకు వెళ్లేలా కసరత్తు మొదలు పెట్టారని ప్రచారం సాగింది. అయినా అంతరి అంచనాలు పటాపంచలు చేస్తూ పాతటీమ్త్‌ఓనే బరిలోకి దిగారు. తనపై తనకు ఉన్న విశ్వాసమే కెసిఆర్‌ను ఇలా చేసిందని అంటున్నారు.