రైతుబంధుతో 58 లక్షల మంది రైతులకు లబ్ధి
సిద్దిపేట,మే21(జనం సాక్షి): రైతు బంధు పథకంతో రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. .రాష్ట్రంలో 30 జిల్లాల్లో పర్యటించి 58 లక్షల మంది రైతులకు 1.42 కోట్ల ఎకరాలకు రూ.6 వేల కోట్ల విలువైన చెక్కులు ఇచ్చామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశానని గుర్తు చేశారు. రైతుల కళ్లలో తనకు ఆనందం కనబడిందని చెప్పారు. తీసుకున్న పెట్టుబడి సాయాన్ని వృథా ఖర్చులు చేయకుండా ఖరీఫ్ పంట సాగుకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా చెక్కులు తీసుకుని బ్యాంకు వద్ద నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను పలకరించగా వారి ముఖాల్లో ఆనందం కనిపించిందన్నారు. బ్యాంకు పరంగా ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి సాయం అందించినందుకు సంతోషంగా ఉందని రైతులు తెలిపారని అన్నారు.