రైతుబంధు సాయం వదులుకున్న మంత్రి జూపల్లి
ఆచరణలో రైతు సంక్షేమాన్ని చూపామన్న మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్,మే11(జనం సాక్షి ): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంట పెట్టుబడి సాయాన్ని వదులుకున్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని చౌటబెట్ల, చుక్కాయపల్లి శివారులోని 11.15 ఎకరాల భూమికి వచ్చిన రూ. 45,500ల రైతబంధు చెక్కులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. ఈ చెక్కులను జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు మంత్రి అందజేశారు. రైతు సమన్వయ సమితి ఖాతాలో ఈ డబ్బును జమ చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. పెద్ద రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. అప్పుడే సామాన్య రైతులకు మరింత మెరుగైన సాయం అందగలదన్నారు. ఇదిలావుంటే రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అన్నారు. దేశ రైతాంగ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ పథకం రైతు బంధు అని అన్నారు. రైతుని రాజుగా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ముద్దాడే వరకు సీఎం కేసీఆర్ నిద్రపోరని, అనుకున్నది సాధించి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే ఆయన ఆశయం అన్నారు. . అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించి రైతాంగానికి సిఎం కేసీఆర్ అండగా నిలిచారు. అలాంటి సీఎం కేసీఆర్‌కి రైతాంగం, ప్రజలు అండదండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే రైతు బంధు పథకం కింద రైతులకు పట్టా పాసు పుస్తకాలు, చెక్కులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజవర్గంలోని బాలానగర్ మండలం బోడ జానంపేటలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది. పంచవర్ష ప్రణాళికలు వేశారు. రైతే రాజు అన్నారు. అన్నదాతే దేశానికి వెన్నెముక అన్నారు. కానీ రైతుని పట్టించుకున్న పాపాన పోలేదు. 40 ఏళ్ళు, ఆతర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. ఆ తర్వాత టిడిపి, ఇతర పార్టీలు పాలించాయి. కానీ, రైతాంగానికి ఒరిగిందేవిూ లేదు. కనీస మద్దతు ధర లేదు. పండిన పంటలకు గిడ్డంగులు లేవు. అప్పులు మిగిలి ఆత్మహత్యలకు పాల్పడటమే శరణ్యమైంది’ అని అన్నారు.
‘అందుకే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన అదృష్టం కొద్దీ నాటి ఉద్యమ నాయకుడు కేసీఆరే సీఎం అయ్యాడన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు అయినందున రైతుల సమస్యలు తెలిసిన వాడిగా రైతుని రాజుగా నిలిపేందుకే రైతు బంధు పథకాన్ని తెచ్చారు. రైతులకు పంట పెట్టుబడిని తానే ఓ పెద్దన్నలా అందిస్తున్నాడు. ఎకరాకు రూ.4వేల చొప్పున, రెండు పంటలకు అందిస్తున్నారు. ఇలా ఏడాదికి ఎకరాకు రూ.8వేలు అందుతాయి. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. యావత్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా కెసిఆర్ తెలంగాణలో అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత
ప్రభుత్వాల మాదిరిగా తమ ప్రభుత్వం చెప్పేది కాదని చేసి చూపించేది’ అని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.