రైతుబీమా పథకం చరిత్రాత్మకమైనది 

రాష్ట్ర వ్యాప్తంగా 58లక్షల మంది రైతులకు లబ్ధి
కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు
రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా
నల్లగొండ, జూన్‌6(జ‌నం సాక్షి) :  రైతుబీమా పథకం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారి రైతు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని, అందుకు అనుగుణంగా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను  అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. తాజాగా రైతు బీమాతో 58లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనుకోకుండా రైతు మరణిస్తే 10రోజుల్లోనే కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందిస్తామన్నారు. దేశంలో రైతుల దిశ – దశ మార్చే విధంగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. దేశానికి సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.  రైతులకు సేవచేసేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితీలను ఏర్పాటు చేసిందని  సూచించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు సమితీ నాయకులు రైతులకు అండగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. రైతాంగ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రైతులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారని పేర్కొన్నారు. రైతు సమితీ సభ్యులు రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉండాలని అన్నారు.అందుకే కాంగ్రెస్‌ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. అన్ని జిల్లాల్లో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించటంతో పాటు, జిల్లాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా నిధులు కేటాయిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఎయిమ్స్‌, మెడికల్‌ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని గుత్తా సుఖేందర్‌ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేతలు తెలుసుకొని వ్యాఖ్యలు చేయాలని, ఇష్టారీతిలో సత్యాలను అసత్యాలుగా చెప్పాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.