రైతులకు ఇక తిరుగు ఉండదు
ప్రాజెక్టులు పూర్తయితే నీటి సమస్య రాదు: జోగు
ఆదిలాబాద్,డిసెంబర్21(జనంసాక్షి): వచ్చేది రైతునామ సంవత్సరమని మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రైతులకు ఇప్పటికే 24 గంలట కరెంట్ అందివ్వడంతో పాటు, ఎకరాలకు 4వేల ఆర్థిక సాయం అందించామని అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే ఇక నీటికి కూడా ఢోకా ఉండదన్నారు. ఆ దిశగా సిఎం కెసిఆర్ సంకల్పంతో రైతులకు మహర్దశ రాబోతున్నదని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఏడాది కావస్తున్నందున ఇప్పటికీ ఆటోస్టార్టర్లను తొలగించుకోని వారు ఇక నిర్భయంగా తొలగించుకోవాలని రైతులకు మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రైతులకు సూచనల చేశారు. అలాగే ప్రతి రైతు పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని రుజువయ్యిందని అన్నారు.పైసా ఖర్చు లేకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామగ్రామాన తిరుగుతూ భూ సమస్యలను పరిష్కరించడం సంతోషకరమన్నారు. అలాగే అర్హులైన వారికి వెంటనే వారసత్వపు పట్టాలను రెవెన్యూ సిబ్బంది అందజేస్తున్నారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటువంటి సాహసోపెతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్‌కు రైతులు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. సమస్యలను ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, చిన్న, చిన్న కారణాలతో పనులను నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా ఎత్తిపోతల పథకాల పనులను పూర్తి చేస్తామని అన్నారు.