రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు-మంత్రి పోచారం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రైతులను సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజమైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా వర్ని

మండలం తగిలేపల్లిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ రైతులు కలిసి ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లా, మండల, గ్రామ కమిటీలు సమన్వయంతో పని చేస్తాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ. 8 వేల చొప్పున రైతుల అకౌంట్లోనే వేస్తామని చెప్పారు. అన్యాక్రాంతమైన భూముల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో అపోహలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పోచారం మరోమారు స్పష్టం చేశారు.