రైతులకు వరం కానున్న పసల్ బీమాయోజన్
మెదక్,ఏప్రిల్5(జనంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇంతవరకు రైతులకు పంట నష్టపోయిన సమయంలో బీమా అందడం లేదని, ఈ పథకం ద్వారా పంట నష్టపోతే సమయానికి పరిహారం అందుతుందని తెలిపారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రబీలో వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరవు దృష్ట్యా ప్రజలు ప్రతి నీటి బొట్టును కాపాడాలని, వృథా చేయరాదని సూచించారు. రాబోయే రెండునెలలు కీలకమని, పొదుపుగా వాడితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. మిషన్ కాకతీయ పనుల ద్వారా 60 ఏళ్ల తర్వాత చెరువులకు జలకళ వచ్చిందని ఎంపి పేర్కొన్నారు. చెరువు బాగుంటేనే వూరు బాగుంటుందని, అందులో నీళ్లు ఉంటేనే ఆయకట్టు బాగుండి, భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీటి ఎద్దడి ఉండదన్నారు. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు నీళ్లు రానున్నాయని తద్వారా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు పడాలని దేవుడిని ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల, రైతుల మనిషని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాన్నారన్నారు.