రైతులకు వీరు చేసిందేవిూ లేదు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌18(జ‌నం సాక్షి): ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలు రైతులకు చేసిందేమి లేదని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకునే ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ చేయడంతోపాటు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.8 వేలు, 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాలను గమనించి ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ నేతలే ఓడిస్తారని, ఇక భాజపాకు గతేడాది వచ్చిన ఓట్లు తగ్గిపోనున్నాయని వివరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు. దేశ ప్రజలందరికీ ఈ పథకాలు చేరువ కావాలంటే కెసిఆర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇతర రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయని అన్నారు.