రైతులను ఆదుకుంటాం

3

– దెబ్బతిన్న పంటలకు  పరిహారం చెల్లిస్తాం

– మంత్రి హరిశ్‌

మెదక్‌,  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):

వడగళ్లవల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. ఈ యేడు గండం గడిచిందనుకుంటే రైతులను నష్టాలు వెన్నాడాయని అన్నారు. చేతికి పంట వచ్చే తరుణంలో తీవ్ర నష్టం జరిగిందన్నారు. నంగునూరు మండలం బద్డిపడగ, సిద్ధన్నపేటలో బుధవారం వడగళ్ల వల్ల దెబ్బతిన్న  పంటలను గురువారం ఆయన సందర్శించి పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంటనష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సిఎం కెసిఆర్‌ ఇటీవలే సమావేశం నిర్వహించి దీనిపైస్పష్టమైన హావిూ ఇచ్చారన్నారు. ఆయా గ్రామాల్లో రాలిన మామిడి, దెబ్బతిన్న వరిని పరిశీలించారు. ముఖ్యంగా సిద్దిపేట, నంగునూరు, చేర్యాల, బచ్చన్నపేట ప్రాంతాల్లో పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయని అన్నారు.  నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లును ఆదేశించారు. వడగళ్లతో పంటలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలియగానే మంత్రి వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. మంత్రి  హరీశ్‌రావు వడగళ్ల బాధిత గ్రామాల్లో పర్యటించి పంట నష్టం నేరుగా పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందరాదని ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. నంగునూరు మండలం సిద్దన్నపేట, బద్దిపడగ గ్రామాల్లో బుధవారం సాయంత్రం  అరగంటసేపు కురిసిన ఈ వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. చేతికి వస్తుందనుకున్న దశలో పంటలు నేల పాలవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. క్రమంగా వర్షం ఉద్ధృతి పెరిగి రాళ్ల వానగా మారింది. అరగంటపాటు నిమ్మకాయల పరిమాణంలో వడగళ్లు పడ్డాయి. దీంతో కోతదశలో ఉన్న వరి కంకులు రాలి పోయాయి. నేలపాలైన వడ్లను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. సమస్యను అధిగమించి కాపాడుకున్న వరి నేల పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గాలులతో కూడిన రాళ్లవానతో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి, చెట్లు నేలకూలాయి పిక్క కట్టే దశలో ఉన్న మామిడి కాయలు పూర్తిగా రాలి పోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.కూరగాయల తోటలు, మొక్కజొన్న పంట దెబ్బ తిన్నాయి. ఈ గ్రామాల్లో 200 ఎకరాలలో మామిడి, 200 ఎకరాలలో వరి పంట ధ్వంసం అయినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. స్థానిక టిఆర్‌ఎస్‌ నేతలు కూడా గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు.