రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదే
చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్
నర్సంపేట, సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్ ఛార్జీల ను విపరీతంగా పెంచి రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర టిడిపి అధినేత నారా చంద్రబాబుకే దక్కిందని టిఆర్‌ఎస్ శాసన సభ పక్షనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్‌రావు ఆరోపించారు. సోమవారం నర్సంపేట పట్టణం లోని జిఆర్ గార్డెన్‌లో టిఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరిశ్‌రావు మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని తెలంగాణలో రక్తపుటేరులు పారించిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. తెలంగాణ వాదంపై ఉక్కుపాదం మోపడంలో కూడా వెనుకాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సైతం తెలంగాణ ఎమ్మెల్యే
గొంతుకను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, టిడిపిలను పాతాలలోకంలో పాతిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల సానుకూలంగా ఉన్నామని రాష్ట్రపతి , కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వనున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.చంద్రబాబు ఎన్ని లేఖలు ఇచ్చిన ఆయన కపట ప్రేమను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు. 2014 కల్లా తెలంగాణ వచ్చి తీరుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు శాషించి తెలంగాణ రాష్ట్రాన్ని ముమ్మాటికి సాధించుకోని తీరుతామన్నారు. కాంగ్రెస్ పాలన యంత్రాంగం మొద్దు నిద్రలో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా సాధారణ ప్రజానికానికి చేరడం లేదని ఆందోలన వ్యక్తం చేశారు. పౌర, ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం…వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌బాస్కర్ తెలంగాణ ప్రజల పౌర, ప్రజల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. నాడు తెలంగాణను ధగా చేసిన చంద్రబాబే సానుకూలంగా ఉన్నానని ప్రకటిస్తే యావత్ తెలంగాణ లోకం నమ్మలేక పోతుందని చెప్పారు.ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ సమరానికి కవాతు చేయాలి..పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి
తెలంగాణ సమరానికి కవాతు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలలో పరాజయం పాలవుతామనే దురుద్దేశ్యంతోనే స్థానిక సంస్థల ఎన్నికల సమరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజానీకం సమాఖ్యవాద పార్టీలను ఎంతమాత్రం నమ్మడం లేదన్నారు. పాలకుల అప్రజాస్వామిక విధానాలతో ప్రజల అభివృద్ధి విధ్వంసకర పరిస్థితులలో ఉందన్నారు. తెగువతో పోరాటాలు నిర్వహించి స్వరాష్ట్రం సాధించుకుంటేనే అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
పల్లెబాట సమరానికి సిద్ధం…టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది
నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరం చేసేందుకు సిద్దంగా ఉన్నామని, పల్లె ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రజల అభివృద్ధిని, సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. వివిధ శాఖలలో ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు సంక్షేమ పథకాలకు మధ్య దళారులుగా మారుతున్నారని ఆరోపించారు. 26 శాఖలలో పుట్టగొడుగులా అవినీతి విలయతాండవం చేస్తుందని చెప్పారు. పల్లె ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు పెద్ది తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు రవిందర్‌రావు, రాజయ్య, అచ్చ విద్యాసాగర్, నరేందర్, యాదవరెడ్డి, పరమేశ్వర్, వెంకటేశ్వర్లు, యాకూబ్‌రెడ్డి, సంగులాల్, భరత్‌కుమార్‌రెడ్డి, నాయిని నర్సయ్య, పుట్టపాక కుమారస్వామి, మచ్చిక నర్సయ్య, మోటూరి రవి, దార్ల రమాదేవి, తిరుపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.