రైతులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు అప్పనంగా రుణమాఫీలు

మండిపడ్డ రాహుల్‌

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగిస్తూ మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘రైతులు ఎంతో శ్రమిస్తున్నారు. కానీ వాళ్లకు మాత్రం ఫలితం దక్కడం లేదు. రైతులు ఎంతో కష్టపడుతున్నా మోదీజీ పట్టించుకోవడం లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు మాత్రం కోట్లకు కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నారు. 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. కానీ రైతులకు చేసిందేవిూ లేదు. వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వాళ్ల పిల్లలు ఏడుస్తున్నారు’ అని రాహుల్‌ మండిపడ్డారు. బ్యాంకుల ఎన్‌పీఏలు వెయ్యి కోట్లకు పైగా దాటిపోయాయి.. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం శూన్యమని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌ విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపిన రాహుల్‌ గాంధీ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌తో మాజీ ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీకి ఆహ్వానం పంపలేదని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్‌ విందు ఇస్తున్న క్రమంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విందుకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 2015లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు సోనియాగాంధీ ఆతిథ్యం ఇచ్చారు.