రైతులను పట్టించుకోని సర్కార్
నల్గొండ,సెప్టెంబర్19(జనంసాక్షి): రైతుల కోసం ఎంతో చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది తప్పిస్తే చేస్తున్నదేవిూలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండు చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. బ్యాంకులు సకాలంలో ముందుకు వచ్చి రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారని వాపోయారు. బీమా వర్తింపజేయడం లేదని, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.