రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌కు వరుణుడు బుద్ది చెప్పాడు

నిజాంసాగర్‌లోకి భారీగా వరదనీరు

సిద్దిపేట సదస్సులో మంత్రి హరీష్‌ రావు వెల్లడి

సిద్దిపేట,ఆగస్టు 21(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్‌ నేతలకు వరుణ దేవుడు బుద్ది చెప్పిండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి 2,50,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాల్వలు, గుత్ప, అలీసాగర్‌ ప్రాజెక్టుకు నీళ్లు వదలాలని ఆదేశించినం. ఇపుడు రైతులంతా ఆనందిస్తుంటే..కాంగ్రెస్‌ నాయకులు ఏడుస్తున్నరని మండిపడ్డారు. సిద్దిపేట పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో పాడిపశువుల పంపిణీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..వానదేవుడు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిండు. పుష్కలంగా వర్షాలు పడి తెలంగాణను ఆశీర్వదించిండన్నారు. రూ.130 కోట్లతో 20వేల మంది రైతులకు పాడి పశువులు ఇస్తున్నం. రైతులు తమకు నచ్చిన పశువులను ఇష్టమొచ్చిన దగ్గర తెచ్చుకోవచ్చన్నారు. పాల ఉత్పత్తి పెరిగి రైతులు ఆర్థికంగా..ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని హరీశ్‌ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అడగకుండానే రైతులకు అన్నీ చేస్తున్నడని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ బ్లూ, పింక్‌, వైట్‌ విప్లవానికి నాంది పలికారన్నారు.