రైతులను రెచ్చగొడుతున్నారు

4

– మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి): మెదక్‌ జిల్లాలో ప్రతిపక్షాలు మల్లన్న సాగర్‌ విషయంలో రైతులను, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం చూస్తున్నాయని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఆదివారం జరిగిన ఘటన కేవలం విపక్షాల రాజకీయ లబ్దికి చేసినప్రయత్నమన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం తెలంగాన భవన్‌లో ఆయన పార్టీ సహచరులు ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లతో కలసి విూడియాతో మాట్లాడారు. విపక్షాలు  ఇచ్చిన బంద్‌ విఫలమైందని  మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాల బంద్‌కు ప్రజల మద్దతు లేదు. కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు యథావిధిగా తెరుచుకున్నాయి. ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మల్లన్నసాగర్‌ కింద ఉన్న ఎనిమిది గ్రామాల్లో ఆరు గ్రామాలు ఇప్పటికే భూములు ఇచ్చేందుకు అంగీకరించాయి. మిగతా రెండు గ్రామాల ప్రజలతో రెండు మూడు రోజుల్లో చర్చలు జరుపుతాం. భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తేవడం లేదు. ప్రతిపక్షాలు ఎక్కడైతే టెంట్లు వేసుకుని ధర్నాలు చేశారో.. అదే స్థలంలో రైతులతో చర్చలు జరిపి వారి సమ్మతితో భూములు సేకరిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మిగతా రెండు గ్రామాల ప్రజలు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. రైతులు కోరిన విధంగా జీవో 123 లేదా 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపడుతాం. ఆదివారం  జరిగిన ఘటన వెనుక టీడీపీ, సీపీఎం కార్యకర్తల హస్తం ఉంది. ఆ వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. ప్రాజెక్టులు కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఏదో ఒకరకంగా ప్రాజెక్టుల విషయంలో వివాదాస్పదం చేసి సమస్యలను సృష్టిస్తున్నారు. భూముల సేకరణ విషయంలో రైతులతో ఎన్ని సార్లెనా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు కోరిన విధంగా భూసేకరణ చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. తాము ప్రజల సంక్షేమం కోరి ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవరిస్తున్నాయని మంత్రి విమర్శించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కట్టకుండా విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిన్న జరిగిన లాఠిఛార్జికి విపక్షలే కారణమన్నారు. హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులను ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. సీపీఎం, టీడీపీ కార్యకర్తలు మల్లన్నసాగర్‌ నిర్వాసితులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి సీపీఎం, టీడీపీ కార్యకర్తలను తరలించి హింస సృష్టించారని.. ఇవన్నీ బయటపెడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల గురించే జరిగిందన్నారు. ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాల్లోని మొదటి ట్యాగ్‌ లైనే నీళ్లు అని గుర్తు చేశారు. మల్లన్నసాగర్‌ అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారని, రిజర్వాయర్‌ లన్నీ నీళ్లుంటేనే కట్టారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టలన్నీ నీళ్లుంటేనే కట్టారా అని అన్నారు.