రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోంది: రేవంత్
మెదక్: రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోందని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొవాలని చూస్తోందని, మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమానికి అన్ని వర్గాల వారూ మద్దతిచ్చారని రేవంత్ తెలిపారు. గ్రామాల్లో భూములన్న రైతులే కాదు రైతు కూలీలు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి వ్యతిరేకంగా చాలా రోజులుగా ప్రజలు ఉద్యమిస్తున్నారని, జీవో 123 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామనడం దారుణమని రేవంత్ అన్నారు. పోలీసులను నమ్ముకుని ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు వాడిన భాషను ఇప్పుడు హరీశ్‌రావు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ సమీపంలోని పాములపర్తి రిజర్వాయర్‌ను 21 నుంచి 7 టీఎంసీలకు తగ్గించిన ప్రభుత్వం, మల్లన్నసాగర్ ముంపును ఎందుకు తగ్గించదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని లేని పక్షంలో రెండురోజుల్లో భూనిర్వాసితుల సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేసుకుని, ఆగస్టు 13, 14న ఇందిరాపార్క్ దగ్గర టీడీపీ నిరసన దీక్ష చేపడతామని రేవంత్ హెచ్చరించారు.