రైతులు తలెత్తుకునేలా చేసిన సిఎం కెసిఆర్‌

రైతుబంధు చెక్కలు పంపిణీలో మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రైతులు తలెత్తుకుని తిరిగేలా సిఎం కెసిఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  జిల్లాలోని బాలానగర్‌ మండలం బోడజానంపేటలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో రైతుబంధు పథకంను మంత్రి ప్రారంభించి చెక్కులు, పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలోని రహదారులు, చెక్‌డ్యాంలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. పెట్టుబడి సహాయంను సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని, రైతుల గురించి ఆలోచించే నాయకుడు లేడన్నారు. కానీ తెలంగాణలో మాత్రం రైతుల గురించి ఆలోచన చేసిన నాయకుడిగా సిఎం కెసిఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.  రైతును రాజును చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరిగోస పడ్డారని మండిపడ్డారు. ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కరంట్‌ లేక అనేక కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. రాత్రి పూట కరంట్‌తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, పంటకు పెట్టుబడి పథకాన్ని సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించారని చెప్పారు. రైతు బంధు పథకం చారిత్రాత్మకమని కొనియాడారు. అందుకే అన్నదాతలు సీఎం కేసీఆర్‌కు మద్దతు పలకాలన్నారు.
———–