*రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి*
బుర్రి శ్రీరాములు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కలకోవ గ్రామములో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం గ్రామ మహాసభ మండవ లింగయ్య అధ్యక్షతన జరిగినది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీ రాములు హాజరై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, 13 నెలలపాటు ఢిల్లీ నగర వీధుల్లో కేంద్రంపై పోరాడి విజయం సాధించారని, ఈ విజయం దేశ రైతాంగానికి ఆదర్శనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు కరెంటు అందిస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం, రోజుకు 9 గంటలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నెల 23న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలపై జరుగుతున్న ధర్నాలో వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని తొమ్మిది మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మండవ లింగయ్య, ఉపాధ్యక్షులుగా గుండు రంగయ్య, కార్యదర్శిగా ముదిగొండ వీరభద్రంలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండవ వెంకటాద్రి, సురభి వెంకటనారాయణ, ఎం శ్రీను, రామయ్య, శాంతి, సోమయ్యలతో తదితరులు పాల్గొన్నారు.