రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం: హరీష్‌రావు

సిద్దిపేట,మే17(జ‌నం సాక్షి ):  రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరులో రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాలు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకు పరితపిస్తున్న నేత, రైతుబిడ్డ కేసీఆర్‌ అని అన్నారు. త్వరలోనే సాగునీటి కల నెరవేరనుందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు పేర్కన్నారు.రైతన్నను ఆదుకునేందుకే సిఎం కెసిఆర్‌ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు బంధు చెక్కుల పంపిణీతో గ్రావిూణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. గత పాలకులు రైతన్నను కనీసం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చి, కెసిఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సంతోషంగా
ఉన్నప్పుడే దేశం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. రైతన్నలను అన్ని విధాల ఆదుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు.
—–