రైతుల చలో సింగపూర్ యాత్ర
జెండాఊపి ప్రారంభించిన సిఎం చంద్రబాబు
అమరావతి,అక్టోబర్30(జనంసాక్షి): రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎపి సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చేప్పానని గుర్తుచేశారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల బృందం అమరావతి నుంచి సింగపూర్‌కు బయలుదేరి వెళ్లింది. రైతు యాత్రను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జెండా ఊపి ప్రారంభించారు. వెలగపూడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రైతుల బృందం బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రైతులు సింగపూర్ వెళ్లనున్నారు. మొత్తం 123 మంది రైతుల్లో తొలి విడతగా 34 మందిని సింగపూర్‌కు ప్రభుత్వం పంపిస్తోంది. రైతులకు భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని రైతులు సింగపూర్‌కు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 35ని తొలి బ్యాచ్‌కి ఎంపిక చేసి, వారిని సింగపూర్‌కి పంపుతోంది చంద్రబాబు సర్కార్. సింగపూర్‌కి వెళ్ళి, అక్కడి అభివృద్ధిని కనులారా వీక్షించి, ఆ వివరాల్ని మిగతా రైతులతో పంచుకునేలా ఈ ‘ప్రత్యేక పథకాన్ని’ చంద్రబాబు సర్కార్ రూపొందించింది. చంద్రబాబు సర్కార్ ‘సింగపూర్ యాత్ర’ పేరుతో రైతులకు ఆఫర్ ప్రకటించగానే, పాస్‌పోర్టులు వున్నవారినే లాటరీ పక్రియకు ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారిలో, తొలి బ్యాచ్‌గా సింగపూర్‌కి వెళుతున్నవారు సిద్దమయ్యారు. ‘మేం ఒకప్పుడు రైతులం.. ఇప్పుడు మేం వ్యాపారులుగా మారాం.. రైతే రాజు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. చంద్రబాబు రైతుల్ని వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చారు.. సింగపూర్‌కి వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తల గురించి తెలుసుకుంటాం..’ అని రైతులు గొప్పగా చెప్పడం గమనార్హం. 33వేల ఎకరాల భూములిచ్చిన వందలాది మంది రైతుల్లో 123మందిని సింగపూర్‌కి పంపించనున్నారు. 2019జనవరి నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని రెండు మూడేళ్ళ క్రితమే చంద్రబాబు సర్కార్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు అమరావతిని వేదికగా చేసుకునే సానుకూల పరిస్థితి నెలకొంది. ప్రవాసాంధ్రులు తమ మాతృభూమి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికి సంసిద్ధులయ్యారు. అనతికాలంలో అసాధరణ రీతిలో ఎన్నో మైలురాళ్లు సాధించిన ఘనత మనది. అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి పథకం ప్రజలకే అంకితం అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం భారం కాదని, అది తన బాధ్యత అని, భావితరాలకు తానిచ్చే కానుక అని ముఖ్యమంత్రి చెప్పారు. మూడు దేశాల పర్యటనలో మౌలిక సదుపాయాల నిర్మాణాల్లో నాణ్యతపై కూడా అధ్యయనం చేశామని సీఎం చెప్పారు. ఏ దేశానికెళ్లినా, ఎక్కడి వారిని కలిసినా నిర్మాణంలో ఉండగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేయడం తనకు సంతోషాన్ని కలగజేసిందన్నారు. వారి సహకారంతో రాజధాని నిర్మాణాల విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. తిరుగులేని నాణ్యత కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సీఆర్‌డీఏను ఆదేశించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా అత్యవసరమని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు కానుకగా తాము నిర్మిస్తున్న రాజధాని నగరానికి నిర్మాణ దశలోనే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు రావడం ముదావహమన్నారు. తన విూద ఉన్న నమ్మకంతో అమరావతి పెట్టుబడులకు స్వర్ణధామమైందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అదికారులు పాల్గొన్నారు.