రైతుల మహాపాదయాత్రకు రేణుక మద్దతు

నేను వీరజవాన్‌ కూతురిని…భయమంటే ఏమిటో తెలియదు
రైతులకు మద్దతు పలికితే ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు
విజయవాడ,నవంబర్‌1  (జనంసాక్షి)  : అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు మాజీ ఎంపి,కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళా నాయకురాలు రేణుకా చౌదరి విజయవాడ వచ్చారు. ఇబ్రహీంపట్నం రింగ్‌ రోడ్డు వద్ద రేణుకా చౌదరికి కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ… రైతులు దేశానికి వెన్నెముక అని… అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందని మండిపడ్డారు. అమరావతి మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకుంటున్నారన్నారు. నేను సైనికుడి కూతురిని… దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా… నాకు భయం అంటే ఏంటో తెలియదని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుందని రేణుక తెలిపారు. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘమన్నారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులుకావని… విష్ణు చక్రాలని అన్నారు. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెబుతారని తెలిపారు.
రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వమని మండిపడ్డారు. సాటి మహిళలుగా తనకు బొట్టుపెట్టేందుకు మహిళలు వస్తే పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతికాదన్నారు. రేణుకా చౌదరి అమరావతి మహా పాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వస్తుంటే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో గల్లీ… గల్లీ…ఎప్పుడో తిరిగానని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు.