రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది-లక్ష్మారెడ్డి

 

మహబూబ్‌ నగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్‌ రైతుల పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. శుక్రవారం మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ లో రైతు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగానికి పంటకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి పెడుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడలేదని ఆయన వివరించారు. రైతు సమన్వయ సమితిల ద్వారా రైతు రాజ్యాన్ని సాధించే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నారని మంత్రి తెలిపారు. రైతుల అవసరాలు, వాటిని తీర్చే అవకాశం రైతు సమన్వయ కమిటీల ద్వారా తీరుతుందన్నారు. రైతు సమన్వయ కమిటీలు వేసుకుని రైతుల సంక్షేమానికి మనకు మనమే అంకితం కావాలని ఈ సందర్భంగా సూచించారు. రైతుల సమస్యలు తెలిసిన, వాటిని పరిష్కరించే చైతన్యం ఉన్న వాళ్లనే రైతు సమన్వయ సమితులలో సభ్యులుగా ఉండేలా చూడాలన్నారు. రైతు సమన్వయ సమతి సమావేశంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు