రైతుల సేవలో కౌడిపల్లిశాఖ
మెదక్,మే24(జనం సాక్షి): ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యాధునీకరమైన రీతిలో కౌడిపల్లి డీసీసీబీ శాఖను ఏర్పాటు చేశామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏటియమ్ కేంద్రంతో పాటు పర్సనల్ లాకర్స్, సేఫ్టీ లాకర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ లావాదేవీలు కేవలం 50కోట్ల నుంచి 100కోట్ల వరకు జరిగిందన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 350కోట్ల నుంచి 750కోట్లకు లావాదేవీలు అభివృద్ధి చెందాయన్నారు. నూతనంగా కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన బ్రాంచిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నారు. కౌడిపల్లి డీసీసీబి నూతన బ్రాంచి భవిష్యత్తులో రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా అభివృద్ధి చెందగలదని పేర్కొన్నారు. కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాలకు చెందిన రైతులకు నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్‌లోనే ఇక నుంచి లావాదేవాలు జరుపుకోవచ్చన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం డీసీసీబీ శాఖల ద్వారా రాయితీలపై రుణాలను అందిస్తోందన్నారు. ఇదిలావుంటే గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధియే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సాహాసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గొల్లకుర్మలు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి కూడా సహకార రుణాలు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం ఆదేశిస్తే పాటిస్తామని అన్నారు.