రైతు ఆత్మహత్యల నిరోధంలో నిర్లక్ష్యం
మెదక్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): తెరాసకు ఓట్లేసిన పాపానికి తెలంగాణ రాష్ట్ర రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బి. ప్రతాపరెడ్డి అన్నారు. చెప్పారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెబుతున్న తెరాస నాయకులకు రైతుల బాధలు పట్టడం లేదన్నారు. వారు బంగారు తెలంగాణలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించకపోతే బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయని అన్నారు. ప్రభుత్వ దివాళాకోరు విధానాల వల్లే రాష్ట్రంలో, ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హావిూల వర్షం కురిపించి నేడు ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని చెప్పి నేడు సర్వేల పేరిట కాలయాపనకు సిద్ధమైందన్నారు. విద్యుత్ ఛార్జీల మోతకు సిద్ధమైన ప్రభుత్వానికి ప్రజల నుంచి త్వరలో ఎదురుదెబ్బ తగలనుందన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.