రైతు కమిటీలతో సమగ్ర సర్వే

మెదక్‌,ఆగస్టు 30: సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, గ్రామాల వారీగా రైతుల భూములను సర్వే చేయించి హద్దులను నిర్ణయించనున్నట్లు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి తెలిపారు. రైతు సమన్వయ కమిటీల ద్వారా రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం గ్రామ సమన్వయ కమిటీల ద్వారానే అందేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు యోగ్యులైన వారిని ఎంపిక చేసి రైతుల అ భివృద్ధికి తోడ్పాటును అందించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ కమిటీల నియామకాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సర్వేలో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పట్టాభూముల వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఇతరుల ఆధీనంలో ఉన్న భూముల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు ఎకరానిక రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.8వేలను అందించనున్నట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 15 మంది ఉంటారని, నిబంధనల మేరకు కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.