రైతు బంధు పథకం చరిత్రాత్మకం
– మంత్రి హరీష్‌రావు
– గజ్వేల్ మండలంలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
సిద్దిపేట, మే16(జనం సాక్షి) : రైతు బంధు పథకం చరిత్రాత్మకమని మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతుల కోసం ఇంత గొప్ప పథకాన్ని ఏ ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. పంట పెట్టుబడిని వ్యవసాయ అవసరాలకే ఉపయోగించాలని రైతులను ఆయన కోరారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లితో పాటు సిద్ధిపేట అర్బన్ మండలం రంగదాంపల్లిలో బుధవారం రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మంత్రి హరీశ్ రావు రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ అందించడంతో పాటు.. పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. బూరుగుపల్లికి గోదావరి నీళ్లను తీసుకొస్తామన్నారు. మండలానికి ఒక గోదామును నిర్మించినట్లు తెలిపారు.
అటు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన హరీష్ రావుకు గ్రామ ప్రజలు, టీఆర్‌ఎస్
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బయ్యారం స్టేజి నుంచి బూరగుపల్లి వరకు 3 కిలోవిూటర్ల మేర బైక్‌పై భారీ ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజు వేషాలు, వినూత్న రీతిలో కోలాటాలు, కళాకారుల నృత్య ప్రదర్శన చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రోడ్డు కార్పొరేషన్ ఛైర్మన్ నర్సారెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ భూంరెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, గడ ప్రత్యేకాధికారి హనుమంతరావు పాల్గొన్నారు.