రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న మాజీ ఏఎంసీ చైర్మన్
మిర్యాలగూడ, జనం సాక్షి.
రైతు సమన్వయ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లోని మంత్రి నివాసం వద్ద చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికు, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కు మరియు నల్లగొండ జిల్లా శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులకు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న ప్రగాఢ నమ్మకంతో తనకు అప్పగించిన కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, అన్నదాతల అపరిష్కృత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కేంద్ర సిల్క్ బోర్డు డైరెక్టర్ గా ఎన్నికై ఆయన నిర్వర్తించిన పదవికి వన్నె తెచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాద్గార్ పల్లి గ్రామ నీటి సంఘం చైర్మన్ గా పని చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించారు. రైతు బిడ్డగా జన్మించిన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అన్నదాతల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నది. రైతుల అపరిష్కృత సమస్యల సాధనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్వర్తించిన అనేక సేవా కార్యక్రమాలు ఆయన్ను అగ్రభాగంలో నిలిపాయి. 2009, జనవరిలో ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ అండ్ సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం చేతుల మీదుగా ప్రతిష్టాత్మక భారత్ జీవన్ జ్యోతి అవార్డును చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా అంచెలంచెలు ఎదిగారు. మిర్యాలగూడ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ చతురతతో, ప్రతిభతో, ప్రత్యేక చరిష్మాతో రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా నల్లమోతు భాస్కర్ రావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2019, ఆగస్టు 25న మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆగస్టు28 నుంచి ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రెండేండ్లకు పైగా రైతుల సమస్యల పై ఎనలేని కృషి చేశారు. రైతులకు, మిల్లర్లకు మధ్య సమన్వయం కుదిర్చారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర దక్కేలా ప్రతిష్ట చర్యలు చేపట్టారు. మార్కెటింగ్ లో దళారీ వ్యవస్థకు చరమగీతం పాడేలా చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టి సఫలీకృతులయ్యారు. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులున్న నియోజకవర్గంగా మిర్యాలగూడకు పేరుంది. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన క్రమంలో 2021 యాసంగి సీజన్ లో వ్యవసాయ మార్కెట్ ఆదాయాన్ని 2కోట్ల 87 లక్షలు అధికంగా నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అభినందనలు పొందారు. ధాన్యం కొనుగోళ్లలో చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుసరించిన విధానాలు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు దిక్సూచిగా మారాయి. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మార్గదర్శనంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధిలో చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.