రైతు సంక్షేమంలో తెలంగాణ ముందు: ఎమ్మెల్సీ

మహబూబ్‌నగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు పతకం ద్వారా నగదు అందచేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. తలకొండపల్లి  మండల కేంద్రంలోని హైస్కూల్‌ ఆవరణలో వ్యవసాయశాఖ ద్వారా పొలం యాంత్రీకరణ పథకంలో భాగంగా మండలానికి మంజూరైన 8 ట్రాక్టర్లను ఆయన లబ్దిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, అందులో భాగంగానే రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ కాకతీయ, మే 10 నుండి రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు 8వేల రూపాయలు రెండు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు. రైతు బంధు పథకం 10 నుండి 17 వరకు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ నిర్మల, ఎంపిపి లక్ష్మిదేవి రఘురాం, జడ్పిటిసి నర్సింహా, పిఎసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ యాదవ్‌, షాద్‌నగర్‌ ఎడి బిక్షపతి, ఎఓ రాజు, ఎఈఓలు సురేష్‌, రామాంజ, విజయ్‌, రైతులు శంకర్‌ నాయక్‌, రవీందర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, రఘురాములు, పాండు, రాజేందర్‌, వివిధ గ్రామాల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.