రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం: ఎమ్మెల్యే

మెదక్‌,మే30(జ‌నం సాక్షి): రైతులకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తున్నామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ఐదు లక్షల ఇన్సూరెన్సును త్వరలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుందని అన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లోని పూడిక మట్టిని పొలాలకు ఇవ్వడం, పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాది కాలంలో రూ. ఎనిమిది వేలు, సకాలంలో ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేలా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రతి గుంటకూ సాగు నీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇప్పుడు రైతులకు రూ. 5లక్షల బీమా దేశ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రమాద బీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు ఏ కారణంతో మృతి చెందినా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు కేబినెట్‌ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. ఈ పథకం అమలు చేసేందుకు ఎల్‌ఐసీ అధికారులతోనూవిధి విధానాలపై సిఎం కెసిఆర్‌ చర్చించినట్లు చెప్పారు. 
—————-