రైతు సంక్షేమమే సర్కార్ లక్ష్యం: పైళ్ల
భువనగిరి,జూలై3(జనంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించాలని సూచించారు. పూడికతీత పనుల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిషన్‌కాకతీయ నాలుగో విడతలో భాగంగా అనేక చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. గ్రామాల్లో చెక్‌డ్యాం నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. చెక్‌డ్యాంలను బలోపేతం చేసి రైతులకు సమగ్రంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల రైతులకు సమగ్రంగా సాగునీరందించేందుకు చెక్‌డ్యాంలను బలోపేతం చేసే దిశగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పటిష్టంగా చెక్ డ్యాం పనులు చేపట్టి వర్షపునీరును అదిమి పట్టి సాగునీరందిస్తామన్నారు. అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.