రైతు సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష
చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి
జనగామ,డిసెంబర్12(జనంసాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కెసిఆర్‌ను నమ్మారని అన్నారు. కెసిఆర్ కూడా వారి సంక్షేమం విషయంలో రాజీ పడలేదన్నారు. 24గంటల కరెంట్, పెట్టుబడి, బీమా అన్నవి దేశంలో ఎక్కడా లేవన్నారు. కేసీఆర్ రాష్ట్ర సాధనకు చేసిన కృషి, స్ఫూర్తి, పట్టుదలను ప్రజలు మర్చిపోవద్దన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తించి ఆదరించారని వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఊళ్లల్లో సింగిల్‌ఫేస్ కరెంటే ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. పెళ్లో, చావో ఏదై నా కార్యం ఉంటే కరెంట్ లైన్మెన్ల నుంచి ఏఈలు, డీఈల దాకా బతిమిలాడాల్సి వచ్చేది. కరెంటు లేక ఇళ్లల్లో వ్యక్తిగత అవసరాలకు నీరు లేక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇక త్రీఫేస్ కరెంట్ గురించి చెప్పనలవి కాదు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో వచ్చేది. కరెంట్ వచ్చే సమయాన్ని చూసుకుంటూ రైతు నిద్రలేక పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీంతో రైతులు అర్ధరాత్రులు పొలంబాట పట్టి విద్యుత్‌షాక్‌తో, విషపురుగుల బారిన పడి తనువు చాలించాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదిని అన్నారు.