రైతు సంక్షేమ ప్రభుత్వమిది: రామలింగారెడ్డి
సిద్దిపేట,ఆగస్ట్11(జనం సాక్షి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రాజెక్టులను కొత్త సుంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాళేశ్వరం నీటి తరలింపు పథకం ఓ అద్భుతమైన విజన్ అన్నారు. ఎస్సారెస్పీని నింపసడం అన్నది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు. ఎస్సారెస్పీ 365 రోజులు నీళ్లు ఉంటయి కాబట్టి ఇక్కడి నుంచే రైతుల పొలాలకు ఇక నమ్మకంగా నీరు చేరుతుందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు నీళ్లు రావద్దనే దుర్మార్గాలు చేస్తున్నారని అన్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని అన్నారు. నీళ్లు ఇవ్వడమే గాకుండా రైతులు పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు థర కల్పించి ఆదుకుంటుందన్నారు. ఐకేపీ కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని, రైతులకు సమస్యలు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.మిషన్‌కాకతీయ పథకం ద్వారా ఇప్పటికే ఎన్నో చెరువులకు మరమ్మతు చేయడం వల్ల వాటిలో సంవృద్ధిగా నీరు చేరి రైతులకు సాగునీరందుతుందన్నారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా రైతులు తమ పొలాల్లో కందకాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణ కోసం జలనిధి కార్యక్రమం చేపట్టిందని, రైతులు కూడా కందకాల ఏర్పాటు చేసుకుంటే వారి భూముల్లో ఉన్న బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కందకాల ఏర్పాటుతో తమ భూమికోల్పోతామనే అపోహలు విడనాడాలన్నారు. సమైక్యాంధ్ర పాలనలో ఆంధ్రా పెత్తందార్ల మోచేతి నీళ్లు తాగిన కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన కరెంట్‌ను ఆంధ్రోళ్లు దోచుకెళ్తుంటే పిరికిపందల్లా కూర్చున్నారని విమర్శించారు.