రైతు సమన్వయ సమితులతో కొనుగోలు కేంద్రాలు

కాంగ్రెస్‌ రచ్చ చేయడం మానుకోవాలన్న పోచారం

మెదక్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితిల ద్వారా 5 వేల సెంటర్లలో పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం మెదక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ… జనుము సాగుకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా నీరు వస్తోందన్నారు. అలాగే పోచారం ప్రాజెక్టు ఎత్తు

పెంచడం లేదన్నారు. అలాగే కాంగ్రెస్‌ నాయకులు రాజకీయాలు మాని సహకరించాలని మంత్రి అన్నారు. రైతుల కోసం కాదు రచ్చ కోసమే కాంగ్రెస్‌ ఆందోళనలు చేస్తోందన్నారు. శాసనసభ వేదికగా చర్చిద్దాం అంటే బయట ప్రచారం కోసం రాజకీయ దురుద్దేశంతో ఆందోళనలు చేపడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రాణహిత ద్వారా తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. లక్ష యాభై వేల కోట్లతో పాలమూరు, డిండి, సీతారామ కాళేశ్వరం, భక్తరామదాస్‌ తదితర ప్రాజెక్టుల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్‌ ద్వారా హల్ది, సింగూర్‌, ఘనపూర్‌, పోచారం, నిజాంసాగర్‌ ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.వచ్చే యాసంగి, వానాకాలం పంటలకు ఎకరానికి పెట్టుబడిగా 8000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి త్వరలో ఏర్పటు చేసి 500 కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 5,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 72 గంటల్లో కొనుగోలు చేసిన దాన్యానికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమా చేస్తామని పేర్కొన్నారు.