రైతు సమితులపై కాంగ్రెస్‌ ఆందోళన

11న నియోజకవర్గాల్లో ధర్నాలు: ఉత్తమ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరనసగా రాష్ట్రవ్యాప్తం ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న జీవో 39కి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేస్తుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలన తెలంగాణ పాలిట శాపంగా మారిందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల పేరుతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, రాజకీయ లబ్ది కోసం రైతులను పావులుగా వాడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వమే రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని గురువారం నాడిక్కడ విూడియాతో అన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోపై ఇప్పటికే రైతులు కొందరు కోర్టులకు వెళ్లారని, ఏ కారణం చేతనైనా కోర్టులు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తే దానికి రాజకీయాలు పులిమి.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయవచ్చని టీఆర్‌ఎస్‌ చూస్తోందన్నారు. ఇప్పటికే రైతు ఆదాయం సగానికి పడిపోయింది.. ఏ పంటకు మద్దతు ధరలేదని ఆయన చెప్పుకొచ్చారు. రైతు సమన్వయ సమితిలు… టీఆర్‌ఎస్‌ పార్టీ కమిటీలు అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు సంఘాలతో భూ తగాదాల పరిష్కారాన్ని ఒప్పుకోమన్నారు. తెలంగాణలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని జీవో నంబర్‌ 39 దెబ్బతీస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు అధికారాలను కల్పిస్తూ తెచ్చిన రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు.

సమన్వయ సమితులు అధికార పార్టీ పెత్తనానికి వేదికగా ఉపయోగపడతాయన్నారు. రైతు సమన్వయ కమిటీలను రద్దు చేసే వరకు ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. అన్ని రకాల భూములకు ఎకరానికి రూ.4వేలు ఇవ్వాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. జీవో 39కి కేబినెట్‌ ఆమోదంలేదు.. వెంటనే ఉపసంహరించుకోవాలని ఉత్తమ్‌ సర్కార్‌కు సూచించారు.