రైల్వేజోన్‌ పరిశీలించాలని మాత్రమే ఉంది

విభజన చట్టం అదే చెబుతోందన్న రైల్వే మంత్రి

జోన్‌ఏర్పాటు ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వేజోన్‌ ఏర్పాటు అన్నది పరిశీలనాంశం మాత్రమే అని అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ గురించి మాట్లాడిన రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నవారు… అసలు విభజన చట్టంలో ఏముందో చూడాలని ఆయన సూచించారు. రైల్వే జోన్‌ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందని… తాము ప్రస్తుతం అదే చేస్తున్నామని… ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో కూడా చెప్పామని అన్నారు. పియూష్‌ గోయల్‌ తాజా వ్యాఖ్యలతో… విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రైల్వే శాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు తదితర అంశాలపై మాట్లాడేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో విశాఖ రైల్వే జోన్‌ అంశంపై ఆయనను ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేవలం రైల్వేజన్‌ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఆ అంశం ఉందని వెల్లడించారు. తాను కూడా ఆ అంశాన్ని ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నానన్నారు. ఇదే విషయాన్ని గతంలో పార్లమెంట్‌ సమావేశాల్లోనూ చెప్పానని పీయూష్‌ గోయల్‌ గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే జోన్‌ అంశంపై ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఇదిగో.. అదుగో.. అంటూ కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. తొలుత ఒడిశా ఒప్పుకోవడం లేదని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పడంతో జోన్‌ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేదనే వాదనలు వినబడుతున్నాయి.