రైల్వేలో భారీ స్కాం!

11e01svxరైల్వే రిజర్వేషన్ టికెట్లలో భారీ స్కాం బయటపడింది. దేశవ్యాప్తంగా సిండికేట్గా ఏర్పడిన కొందరు సాంకేతిక లోపాలు ఆసరాగా కొన్ని నెలలుగా రైల్వేని మోసగిస్తుండటాన్ని ఉత్తర రైల్వే అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి దాదాపు వంద కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ అధికారుల అంచనా. టికెట్ రిజర్వేషన్ వివరాలను డిపార్టుమెంటులోని తమ మనుషుల ద్వారా ఈ గ్యాంగ్ సేకరిస్తుంది. వాటి ఆధారంగా నకిలీ టికెట్లు ముద్రిస్తుంది. స్టేషన్ నుంచి రైలు బయలుదేరగానే ఈ గ్యాంగ్ సభ్యులు వాటిని వివిధ మారుమూల ప్రాంతాల రిజర్వేషన్ కేంద్రాల్లో రద్దు చేసుకుని డబ్బులు పొందుతున్నారు. రైలు బయల్దేరగానే రిజర్వేషన్ చార్టు అప్డేట్ అయ్యే వ్యవస్థ లేకపోవడంతో ఈ గ్యాంగ్ ఆటలు సాగుతున్నాయి. గడచిన ఆరు నెలల్లో ఒక్క ఢిల్లీనుంచి బయల్దేరే రైళ్లలోనే రూ.60లక్షలకు పైగా స్వాహా చేశారని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై వివిధ రాష్ర్టాలు వేర్వేరుగా దర్యాప్తు చేపట్టడం వల్ల సారూప్యత ఉండకపోవచ్చని, పైగా దర్యాప్తు ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు. కాగా, మొత్తం స్కాంపై సీబీఐతో వేగంగా దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్ అధికారులు రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చారు. మరోవైపు, రైల్వేకు కచ్చితంగా ఎంత నష్టం వచ్చిందో తెలుసుకోవడానికి శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపట్టాలని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.