రైల్వే మంత్రిని కలిసిన టిడిపి ఎంపీల బృందం

న్యూఢిల్లీ,మార్చి9 : తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం సోమవారం న్యూఢిల్లీలో  రైల్వే మంత్రిని కలిసింది. రైల్వేజోన్‌, పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకై వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్లమెంట్‌లో బ్జడెట్‌ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు వారికి చెప్పారు. ప్రత్యేక జోన్‌ ఎక్కడ ఏర్పాటనేది అప్పుడే చర్చిస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో గల్లా జయదేవ్‌, మురళీమోహన్‌, రామ్మోహన్‌ నాయుడు తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మంచి విధానాలన్నింటినీ ఎన్డీయే ప్రభుత్వం కొనసాగిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు అన్నారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధే ముఖ్యంగాని రాజకీయాలు కాదని తెలిపారు. అందుకే యూపీఏ ప్రవేశ పెట్టిన మంచి పథకాల్ని సైతం తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. యూపీఏ చేపట్టిన రైల్వే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు.