రైల్ ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన
మెదక్,ఆగస్టు29(జనం సాక్షి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయంపల్లిలో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్ లైన్ పై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామాయంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తూప్రాన్ మండలం వట్టూరులో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ వల్ల గజ్వేల్, తూప్రాన్, సిద్దిపేట పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇది మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే రైల్వే లైన్ అన్నారు. ఈ రైల్వే లైన్ మొదటిదశ పనులు గజ్వేల్ వరకు 30 కిలోవిూటర్లు డిసెంబరు కల్లా పూర్తి చేసి, జనవరిలో రైలు నడుపుతామన్నారు. రెండో దశలో గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు, మూడో దశలో సిద్దిపేట నుంచి సిరిసిల్ల, కరీంనగర్ వరకు రైల్వేలైన్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



