రోజులు గడుస్తున్నా తెలియని రాహుల్‌ జాడ

iyhqmgqkన్యూ ఢిల్లీ, మార్చి 22 :  కాంగ్రెస్‌ నేతలు తమ యువరాజు రాహుల్‌ గాంధీ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అవును మరి.. నెలరోజులుగా ఆయన కనిపించుట లేదు! ఎక్కడున్నారో ఆచూకీ తెలియట్లేదు. ఫిబ్రవరి 23న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఆయన సెలవులో ఉన్నారు. మార్చి 10 వరకూ రాహుల్‌ సెలవులో ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు మొదట ప్రకటించాయి. ఆ పది దాటి మరో పదిరోజులు గడిచాయిగానీ ఆయన జాడ మాత్రం లేదు. ఆయన సెలవు పొడిగించారని కాంగ్రెస్‌ వారు చెప్పారు. ఆ పొడిగింపు ఎప్పటిదాకానో ఎవరికీ తెలియదు. బహుశా మార్చి నెలాఖరుకు రాహులుడి సెలవు ముగియవచ్చు. అసలింతకీ ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై ఢిల్లీలో రకరకాల వదంతులు షికారు చేస్తున్నాయి!

2014 మే నుంచి మొదలైన కాంగ్రెస్‌ పరాజయాల పరంపర మొన్నటి ఢిల్లీ ఎన్నికల వరకూ నిరాఘాటంగా కొనసాగింది. ఇన్ని పరాజయాలను తట్టుకోవడం ఎవరికైనా కష్టమే! ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం ఎలా? అని ఆత్మావలోకనం చేసుకునేందుకు రాహుల్‌ సెలవులో వెళ్లారని ఒక కథనం. అదేం కాదు సోనియా చుట్టూ ఉన్న కొన్ని ‘గ్రహాలు’ కాంగ్రెస్‌ పార్టీని సర్వనాశనం చేస్తున్నాయని, వారిని పార్టీ నుంచి బయటకు పంపే విషయంలో తల్లితో గొడవపడి, కోపంతో సెలవుపై వెళ్లారని మరో కథనం. కారణమేదైనాగానీ.. కాంగ్రెస్‌ భావి సారథి ఇలా హఠాత్తుగా సెలవులో వెళ్లడం ప్రతిపక్షాలనే కాదు కాంగ్రెస్‌ పెద్దలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ రాహుల్‌ గాంధీ ఎక్కడకు వెళ్లారు? ఉత్తరాఖండ్‌కా? బ్యాంకాక్‌కా?
ఈ నెల 9న ఉదయం రాహుల్‌ థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో, బిజినెస్‌ క్లాస్‌లో బ్యాంకాక్‌ వెళ్లారనే ప్రచారం బలంగా సాగుతోంది. అక్కడ ఆయన ‘అత్యంత ఆప్తుల’తో కలిసి.. కులాసాగా గడుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. రాహుల్‌ అజ్ఞాత ప్రదేశంలో కూర్చుని విపశన ధ్యానం చేస్తున్నారని.. బడ్జెట్‌ సమావేశాలు, భూసేకరణ బిల్లు గొడవల్ని పక్కన పడేసి చక్కగా ఢిల్లీలోని ఫామ్‌ హౌజ్‌లో కూర్చుని క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లన్నింటినీ చూసి తనివితీరా ఆనందిస్తున్నారని.. ఇలాంటిఊహాగానాలూ ఉన్నాయి. ఎందుకంటే.. రాహుల్‌కు జడ్‌ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ సిబ్బంది ఒకరైనా లేకుండా ఆయన ఎక్కడికీ వెళ్లే వీలు లేదు. ఆయన ఢిల్లీ దాటి వెళ్లే పక్షంలో భద్రతా సిబ్బంది ఆ విషయాన్ని పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. హోం శాఖకు అలాంటి సమాచారం ఏదీ లేదు కాబట్టి రాహుల్‌ ఢిల్లీలోనే ఉన్నారనే వాదనకు బలం చేకూరుతోంది.