రోడ్డు ఇలా – బడికి వెళ్ళేది ఎలా.

-నెన్నెల మండల కేంద్రంలోని రోడ్డు దుస్థితి.
– బడికి వెళ్లబోమంటున్న విద్యార్థులు.
– ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నా, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విద్యా, వైద్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికి కనీస సౌకర్యాలు కల్పించడంలోను విఫలమయ్యారు. నెన్నెల మండల కేంద్రంలోని నెన్నెల ప్రాథమిక పాఠశాల మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపికైనప్పటికి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లల్లాడుతున్నారు. పాఠశాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బురదరోడ్డులో వెళ్లలేక బడి మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి మహాప్రభో అని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్ని సార్లు కోరినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సర్కారు బడుల్లో చదవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పించి కనీస సౌకర్యాలు కల్పించడంలో విపలమౌతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల రోజులుగా చిన్నారి విద్యార్థులు బురదరోడ్డులో నానాయాతన అనుభవిస్తూ బడికి వెళ్లడం అధికారులకు గాని, ప్రజాప్రతినిధులు గాని కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ పాఠశాల అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉన్నట్లా, లేనట్టా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం విషయమై స్థానిక సర్పంచ్ ను కోరగా రోడ్డుకు చిన్నచిన్న మరమ్మతులు చేయించినప్పటికి, ప్రతి రోజు కురుస్తున్న వర్షాలకు మరమ్మతులు ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.
ఆధిపత్య పోరులో అభివృద్ధి అంగడయ్యింది.
రాజకీయ పోరులో అభివృద్ధి అంగడయ్యిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సర్పంచ్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడుతుందని స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు విషయంలో ఎడ్డెం అంటే తెడ్డెం అనేలా మారిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావి భారత పౌరులుగా తయారు కావాల్సిన చిన్నారులు బురదరోడ్డులో నానా అవస్థలు పడుతున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించి విద్యార్థులకు బురదరోడ్డు కష్టాలు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.