రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం
– నార్కట్‌పల్లి వద్ద బోల్తా కొట్టిన కారు
– ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు
– హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలింపు
– చికిత్స పొందుతూ కన్నుమూసిన హరికృష్ణ
– శోకసంద్రంలో మునిగిపోయిన నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు
– తండ్రి మరణంతో కన్నీరు మున్నీరైన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రాం
– దిగ్భాంతి వ్యక్తం చేసిన ఏపీ, తెలంగాణ సీఎంలు
– సంతాపం తెలిపిన చంద్రబాబు, వెంకయ్య నాయుడు, లోకేష్, రాజకీయ, సినీ ప్రముఖులు
– ప్రమాద సమయంలో స్వయంగా కారు నడుపుతున్న హరికృష్ణ
– అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపిన పోలీసులు
– కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలు
– నేడు మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
నల్గొండ, ఆగస్టు29(జనం సాక్షి) : దివంగత నేత నందమూరి తారకరామారావు తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61)బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి – అద్దంకి హైవేపై హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం బోల్తా కొట్టడంతో తీవ్రగాయాల పాలైన హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల్లూరులో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు హరికృష్ణ తెల్లవారు జామున 4గంటల సమయంలో బయలుదేరారు. హరికృష్ణతో పాటు మరో ఇద్దరు కారులో ఉన్నారు. కాగా హరికృష్ణే స్వయంగా కారు నడుపుకుంటూ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరారు. కాగా నార్కెట్‌పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా కారు పల్టీ కొట్టడంతో కారు నుండి ముప్పై అడుగుల దూరంలో హరికృష్ణ పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా కారు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల చూడగా హరికృష్ణ పడి ఉండటాన్ని చూసి వెంటనే 108కి సమాచారం అందించారు. హుటాహుటీన చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే హరికృష్ణ కన్నుమూసినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా కారులో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో హరికృష్ణే స్వయంగా కారు నడుపుతున్నారు. నార్కెట్‌పల్లి వద్దకు రాగానే వాటర్ బాటిల్ కోసం వెనక్కు తిరగ్గా ఒక్కసారిగా కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ప్రమాద సమయంలో హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కారు నుండి బయటపడి తలకు తీవ్ర గాయమైంది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి పార్ధివదేహాన్ని మధ్యాహ్నం సమయంలో మొయినాబాద్‌లోని అతని నివాసానికి తరలించారు. పార్దివ దేహం వెంట సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, సోదరుడు బాలకృష్ణ, తనయులు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్‌లు ఉన్నారు. కాగా నేడు హరికృష్ణ
పార్దివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ వద్ద అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. హరికృష్ణ తనయుడు జానకిరాం అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ పార్దివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు..
హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. హరికృష్ణ మృతదేహాన్ని చూసి జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కన్నీరు మున్నీరయ్యారు. తన తండ్రి ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరుమని విలపించారు. అదేవిధంగా హరికృష్ణ సోదరుణులు పురందేశ్వరి, నారా బ్రాహ్మణిలు హరికృష్ణ మృతదేహంను చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబంలో, నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధ ఛాయలు అలముకున్నాయి. నందమూరి హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని నెమరమేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. మృతి వార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
బాల్యంలోనే సినిమాల్లోకి..
నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’, ‘దాన వీర శూర కర్ణ’ తదితర చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్న ఆయన తిరిగి ‘శ్రీరాములయ్య’తో 1998లో మరోసారి వెండితెరపైకి వచ్చారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, ‘సీతయ్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, ‘స్వామి’, ‘శ్రావణమాసం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాల తర్వాత ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు.
రాజకీయాల్లోనూ కీలక భూమిక..
నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక.. హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్ ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు. రాష్ట్రమంతా కలియతిరిగి తెలుగుదేశం గెలుపుకు హరికృష్ణ కృషి చేశారు. తెదేపా అధికారంలోకి రావటం, సీఎంగా నందమూరి తారకరామారావు బాధ్యతలు స్వీకరించారు. తండ్రి ఎన్‌టీ రామారావు చైతన్య రథ సారథిగా టీడీపీ శ్రేణులతో పార్టీ ఆవిర్భావం నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణించారు. ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో చంద్రబాబు పార్టీ పగ్గాలను, సీఎం పీఠాన్ని అధిరోహించడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ అన్నా టీడీపీని స్ధాపించారు. అనంతర పరిణామాలతో తిరిగి చంద్రబాబు గూటికి చేరిన హరికృష్ణ 1995లో బాబు క్యాబినెట్‌లో రవాణా మంత్రిగా వ్యవహరించారు. 2008లో రాజ్యసభకు ఎన్నికైన హరికృష్ణ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న హరికృష్ణ ముక్కుసూటిగా మాట్లాడటం, పలు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పార్టీలో తనకు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. మహానాడులో పాల్గొనడం కన్నా, ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడమే తనకు ముఖ్యమని గతంలో హరికృష్ణ
వ్యాఖ్యానించారు.
హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు..
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది.
దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఏపీ, తెలంగాణ సీఎంలు..
తెదేపా సీనియర్ నేత హరికృష్ణ మృతివార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన బావమరిది నందమూరి హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మృతిచెందడంపై చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే షాక్‌కు గురైన చంద్రబాబు.. కామినేని ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రికి తరలించిన హరికృష్ణకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. కానీ, కాసేపట్లోనే ఆయన మరణవార్త తెలియడంతో చంద్రబాబు బుధవాంరం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికే తీరనిలోటు అని, హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. బాలనటుడిగా, కథానాయకునిగా, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన నిలిచిపోయారన్నారు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చెయ్యి అని కొనియాడారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టుడు నందమూరి హరికృష్ణ అని, ఎన్టీఆర్ చైతన్య రథసారధి నందమూరి హరికృష్ణ అని, తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్ ను రాష్ట్ర ప్రజలకు చేరువ చేశారన్నారు. శాసనసభ్యునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు, మా కుటుంబానికి తీరనిలోటు అని చంద్రబాబు తన సంతాపం ప్రకటించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ సీపీ నేత వైస్ జగన్‌మోహన్‌రెడ్డి హరికృష్ణ మృతి వార్త విని దిగ్భాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మంచి వ్యక్తి అని ఆయన ఆకస్మిక మృతి తనను దిగ్భాంతికి గురి చేసిందన్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి..
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, ¬ంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, నందమూరి హరికృష్ణ మృతి పట్ల దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ ప్రత్యేక ముద్రవేశారని చెప్పారు. వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..నందమూరి హరికృష్ణ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కళా వెంకట్రావు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విూడియా ద్వారా తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలువురు మంత్రులు హరికృష్ణ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో తమకున్న అనుబంధాలను నెమరవేసుకున్నారు. అదేవిధంగా టీతెదేపా నేతలు రమణ, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, తాళ్లూరి బ్రహ్మయ్య తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు.