రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుడు తోకల లింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.

చెంచులు అంటే చిన్నచూపు ఎందుకు ?

జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 16( జనంసాక్షి న్యూస్) : నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం శనివారం నాడు ఫరహబాద్ స్టేజి సమీపం శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫరహబాద్ కు చెందిన తోకల లింగయ్య మృతి చెందాడు.మృతుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో టైగర్ ట్రాకర్ గా విధులు నిర్వహిస్తున్నాడని, అతనికి భార్య,ఒక కుమారుడు ఉన్నారని మృతుని బంధువులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు దాసరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..తోకల లింగయ్య శ్రీశైలం వెళ్లి వస్తున్న వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడడంతో అతనిని మెరుగైన వైద్యం అందించి కాపాడడానికి కనీసం ప్రభుత్వ నుండి హైదరాబాద్ కు తరలించేందుకు అంబులెన్స్ కూడా సకాలంలో అందక మృతి చెందిన పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం చెంచుల సంక్షేమం కోసం ఉన్న ఐటీడీఏ వలన చెంచులకు ఎలాంటి మేలు జరుగడం లేదని,శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదం లో తోకల లింగయ్య కు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ కు తరలించేందుకు అంబులెన్స్ కోసం మేము జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చామని కలెక్టర్ డిటీడీఓ చెప్పారని డిటీడీఓ ఇదే విషయాన్ని ఐటీడీఏ సుపెరిడెంట్ కు చెప్పారని ఐటీడీఏ సుపెరిడెంట్ ప్రభుత్వం తరపున కాకుండా స్వచ్చంద సంస్థ ఆర్డీటీ అంబులెన్స్ ను పంపినారని ఈ మాత్రం దానికి మేము మాత్రం ఆర్డీటీ అంబులెన్స్ కు సమాచారం ఇవ్వలేకపోయామా అని ప్రభుత్వ పాలకులను అధికారులను ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీడీఏ కు అధికారి తో పాటు బడ్జెట్ ఉండేదని కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీడీఏ కు అధికారి లేక ఒకవేళ ఉన్న ఇన్ఛార్జి ,లతో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే మా చెంచు సామాజిక వర్గం జనాభా తక్కువ ఉందని చిన్నచూపు చూస్తే మేము సంఘటిత శక్తిగామారి ప్రభుత్వానికి మా సత్తా ఏమిటో తెలియజేస్తామని అన్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ జిల్లా అధికారి 20వేల సహాయం అందించాడని, కానీ ఐటీడీఏ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనదారున్ని 24 గంటలుగా వస్తున్న ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కూడా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా మైనర్ మేజరా లైసెన్సు ఉందోలేదో ఎలాంటి అతని ఆచూకీ వివరాలు మాకు ఇంతవరకు మాకు తెలియజేయకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ప్రజా ప్రతినిధి స్పందించి మృతుని కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని, మృతుని భార్యకు ఐటీడీఏ శాఖ వారు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ నాయకులు విజయభాస్కర్,ఉడతనూరి లింగయ్య, అప్పాపూర్ పెంట సర్పంచ్ బాల గురువయ్య, టీఎన్జీవో నాయకుడు దాసరి ఆంజనేయులు, ఐటీడీఏ మాజీ మెంబెర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.