ర‌వి కేసు మ‌రో కొత్త‌కోణం

 లవ్ ఫెయిల్యూర్తో చనిపోయారా..?

w9sfxirh
 బెంగళూరు: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ప్రేమలో విఫలం అవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఆరోజు ఆయన తన ఐఏఎస్ బ్యాచ్ మేట్ అధికారిణికి 44సార్లు ఫోన్ చేశారని వారు చెప్తున్నారు. ఈ నెల 16న డీకే రవి తన ఫ్లాట్లో అనుమానాస్పంద స్థితిలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ప్రజాగ్రహ్రం పెల్లుబకడంతో ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా అది మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక వచ్చిన అనంతరమే పోలీసులు తాజాగా ఈ కథనాలు బయటపెట్టడంతో కేసు పలుమలుపులకు దారితీస్తోంది. మరోపక్క ఈ నివేదికపై సోమవారం చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా కోర్టు నిరాకరించింది.

అయితే, ఈ క్రమంలో క్రిమినల్ కేసుల నివేధికను చట్టసభల్లో ప్రవేశపెట్టకూడదని పలువురు వాధిస్తుండగా రవి బ్యాచ్ మేట్ అయిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి భర్త ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించడాన్ని నిలువరించాలని హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్తో ఏకీభవించిన కోర్టు ఆ నివేదికను చట్టసభలో ప్రవేశపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. విచారణ మధ్యలో ఉండగా వివరాలు బయటపెట్టొద్దని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు కేసు విచారణ వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఈ కేసు వివరాలను మధ్యాంతరంగా బయటపెట్టొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దర్యాప్తు అధికారికి, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించింది. సీఐడీ నివేదిక వచ్చిన తర్వాతే రవి తన బ్యాచ్ మేట్ అయిన ఓ ఐఏఎస్ అధికారిణితో ప్రేమలో విఫలం అయ్యాడని, మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పలువురిలో నెలకొంది.