లక్ష్యానికి దూరంగా స్వచ్ఛభారత్
మరుడుదొడ్ల నిర్మాణంలో గ్రామాల్లో అనాసక్తి
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధికారుల ఆందోళన
ఆదిలాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో గ్రామాల్లో ప్రజల సహకారం లేకపోవడంతో ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు. ఊరూరా ప్రచారం నిర్వహించి, ఆర్థిక సాయం అందచేస్తున్నా ప్రజలు ముందుకు రావడం లేదని ఎండివోలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. కచ్చితంగా 75శాతం నిర్మాణాలు పూర్తి చేయాలని లేకపోతే ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శుల వేతనాలు నిలిపివేస్తామని గతంలో ఓమారు కలెక్టర్ హెచ్చరించారు. గ్రావిూణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్చరికలతో ఇప్పుడు వారిలో ఆందోళన కలుగుతోంది. గ్రామాలకు వెళితే ప్రజల సహకారం అందడం లేదని, స్థానిక నేతలు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తున్నదని లబ్ధిదారులకు వివరించి త్వరగా నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. మంజూరైన వాటిలో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించని ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీవోలు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించి నిర్మాణాల ప్రగతిపై స్వయంగా పర్యవేక్షించాలన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను సాధించి బహిరంగ మల విసర్జన రహిత మండలం, గ్రామంగా ప్రకటించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీడీవోలు కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు సహకరించడం లేదని తెలిపారు. కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య ఉందని, లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతోందని కలెక్టర్‌కు దృష్టికి తీసుకుని వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు వంద శాతం నిర్మాణాలు పూర్తయిన 78గ్రామాలను వోడీఎఫ్‌గా ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పలు మండలాల్లో సాధించిన ప్రగతిని అభినందించిన కలెక్టర్ ఇతర మండలాల ప్రగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక రవాణాలో ఆంక్షలు పెట్టవద్దని తహసీల్దార్లను ఇదివరకే ఆదేశించామని పేర్కొన్నారు. నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని, అన్ని వేళలా తాము అందుబాటులో ఉంటామన్నారు. మహిళ ఆత్మగౌరవ సమస్యగా మారిన బహిరంగ
మలవిసర్జనను రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలను భాగస్వాములను చేసి బహిరంగమల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. అయితే క్షేత్రస్థాయిలో తమ బాధలు అర్థం చేసుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.
———-